మరింత జోరు సమ్మె – జేఏసీ పిలుపిస్తే అన్ని సంఘాలూ మళ్లీ సమ్మెలోకి: జేఏసీ చైర్మన్ కోదండరాం – కొత్త రూపాల్లో ముమ్మర ఆందోళనలు!

| October 23, 2011 | 0 Comments
  • Tweet
  • Tweet

తెలంగాణ రాష్ట్రసాధన దిశగా మొదలు పెట్టిన సకల జనుల సమ్మెను కొత్త పుంతలు తొక్కించేందుకు, మరింత ఉధృతం చేసేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ సమాయత్తమవుతున్నది. 40 రోజులుగా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న ఉద్యోగులు ఉద్యమ పథంలో మడమతిప్పేది లేదని స్పష్టం చేస్తున్నారు. ధర్నాలు, మహా ధర్నాలు, గేట్‌మీటింగ్‌లు మొదలుకుని రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధం, రైల్‌రోకో వంటి ఆందోళనలతో తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు సహా సబ్బండ వర్ణాలు ప్రత్యేక రాష్ట్రంపై తమ ఆకాంక్ష చాటినా.. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉద్యమాలు చేపట్టినా, ఆఖరికి ప్రధాన మంత్రికి మొరపెట్టుకున్నా పాలకుల్లో చలనం లేకపోవడంపై ఉద్యోగ సంఘాల కడుపు రగులుతున్నది. ఇంత చేసినా 40 రోజులుగా తెలంగాణపై స్పష్టత రాకపోవడంతో సమ్మెను ఇకపై మరింత ఉధృతంగా నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమైంది.

భవిష్యత్ పోరాట రూపంపై చర్చించేందుకు ఉద్యోగ జేఏసీ స్టీరింగ్ కమిటీ సోమవారం నాడు హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే అవసరమైతే అత్యవసర సర్వీసులనూ నిలిపివేస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్ శనివారం విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేత రఘు చేపట్టిన 72 గంటల దీక్ష కార్యక్షికమంలో ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించకపోతే అత్యవసర సర్వీసులైన పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాతోపాటు, విద్యుత్‌నూ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇదే కార్యక్షికమంలో పాల్గొన్న రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేంత వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఇప్పటికే సమ్మె విరమించిన సంఘాలన్నీ జేఏసీ పిలుపునిస్తే మళ్లీ సమ్మెలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులు ఉద్యమంలోకి రానున్నారని ఆయన చెప్పారు.

ఉద్యమంలోని ముఖ్య నేతలు చేసిన ప్రకటనల నేపథ్యంలో సోమవారం జరిగే ఉద్యోగ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తున్నది. అదే విధంగా ఇప్పటి వరకూ జరిగిన ఉద్యమంకంటే ఉధృతం స్థాయిలో కొత్త పోరాట రూపాలు ఎంచుకునే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకూ జరిగిన సమ్మెను ఉద్యోగ నేతలు సమీక్షిస్తారని తెలుస్తున్నది. తెలంగాణ తొలి దశ పోరాటమైన 1969 నాటి ఉద్యమంలో 37 రోజుల పాటు ఉద్యోగులు చేసిన సమ్మె రికార్డును ప్రస్తుతం 2011లో మలి విడత తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు బ్రేక్ చేశారని, ఉద్యమంలో మరో మైలురాయిని నెలకొల్పారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. నాటి ఉద్యమానికి మించిన స్థాయిలో నేటి ఉద్యమం అనేక విజయాలకు గీటురాయిగా నిలిచిందని చెబుతున్నారు. కేవలం ఉద్యోగులే కాకుండా సబ్బండ వర్ణాలను సమ్మె కట్టించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల పక్షాన నిలిచి పోరాడే సై్థర్యాన్ని ఇవ్వడంలో ఉద్యోగ సంఘాల జేఏసీ విజయాన్ని సాధించిందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

137 సంఘాలతో పాటు, సింగరేణి, ఆర్టీసీ కార్మికులను, విద్యుత్తు ఉద్యోగులను సమ్మెలోకి దింపి సకల జనుల సమ్మెలో కొత్త ఆధ్యాయాలను సృష్టించిందని నాయకులు చెబుతున్నారు. దీన్ని సహించలేని సర్కారు జేఏసీ నేతలు అనేక మందిపై ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేశారని ఆక్షేపిస్తున్నారు. ఏ సెక్షన్‌లపై, ఏ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారో కూడా తెలియని పరిస్థితి కల్పించారని ఉద్యోగసంఘాల నాయకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చర్చలకు పిలిచి కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, మూడు రోజులు గడుస్తున్నప్పటికీ, ఇంతవరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమానికి అండగా నిలవాల్సిన తెలంగాణ ప్రాంత మంత్రులు గానీ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహగానీ కేసుల ఎత్తివేతకు కృషి చేయడం లేదని వారు విమర్శిస్తున్నారు. కనీసం ఉద్యోగుల ఇబ్బందుల పట్ల సానుభూతిని కూడా రాజనర్సింహ వ్యక్తం చేయడం లేదని వారు ఆక్షేపిస్తున్నారు.

ఇప్పటికే రెండు మాసాల వేతనాలను కోల్పోయామని, పండుగలు పబ్బాలకు దూరమయ్యామని, కుటుంబాలతో సహా రోడ్లమీదికి వచ్చి రహదారులను దిగ్బంధనం చేశామని, ప్రపంచ ఉద్యమాల చరివూతలో లేని ఆందోళనా పద్ధతులన్నింటినీ నిర్వహించగలిగామని ఉద్యోగసంఘాల నాయకులు సమీక్షించుకుంటున్నారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులు ఉద్యోగ సంఘాల జేఏసీకి కొండంత బలాన్ని ఇచ్చారని, తెలంగాణ ప్రజలందరికీ గొప్ప విశ్వాసాన్ని కల్గించగలిగారని ఉద్యోగ నాయకులు అభినందిస్తున్నారు. ఈ విజయాలన్నింటినీ క్రోడీకరించుకుని తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటామని ఉద్యోగసంఘాల నాయకులు చెబుతున్నారు.

source from namastetelangana

Related posts:

  1. సమ్మె విరమించేదే లేదు : కోదండరాం
  2. కరెంటు బిల్లులు బంద్, రేపు కరెంటోళ్ళ శంఖారావం, టీజాక్ కో-ఆర్డినేటర్ కె.రఘు ప్రకటన
  3. ఆర్టీసీ సమ్మెపై కుట్ర పన్నుతున్న ప్రభుత్వం
  4. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
  5. నిర్బంధ విధినిర్వహణకు విఫలయత్నం, ఖనిలో కార్మికులను బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు, 6వ రోజు వేడెక్కిన సింగరేణి సమ్మె, ఖాకీగని..సింగరేణి

Tags: ,

Category: News, Telangana

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply


1 × = fiveRecent PostsWeb Design Company Hyderabad, Web Designing Hyderabad, Logo Design Company Warangal, Indian Website Design Company, DevSoftTech.com


BHARATHI DIGITAL PHOTO STUDIO & VIDEO GRAPHERS, Near Sumanjali Function Hall, NGO's Colony Road, Hanamkonda
Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
Raise: UK Overseas Educational Consultancy in Karimnagar, No TOFEL OR IELTS Required
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.