ముమ్మరం కానున్న సీబీఐ దర్యాప్తు -ఇకపై వ్యక్తిగతంగా పిలిపించి విచారణలు -మూడో దశలో అరెస్టులు
జగన్ కంపెనీలు, ఎమ్మార్ ప్రాపర్టీస్ అవకతవకలపై కేసులు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తును మరింత తీవ్రతరం చేయనుంది. తనిఖీల పర్వాన్ని దాదాపుగా ముగించిన సీబీఐ ఇక ముందు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల యజమానులతోపాటు వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టినవారిని ప్రశ్నించనుంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఒకేరోజున రెండు కేసుల్లో సీబీఐ అధికారులు వందకు పైగా నోటీసులు జారీ చేశారు. ఆయా కంపెనీల యజమానులు, వ్యక్తులను వ్యక్తిగతంగా జరిపే విచారణలో కీలకమైన వివరాలు వెల్లడి కావటంతోపాటు ఆధారాలు దొరికే అవకాశాలున్నాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ దశ పూర్తయితే అరెస్టులు ఉంటాయని తెలుపుతున్నాయి. జగన్ కంపెనీల కేసులో మొదటి నిందితునిగా జగన్‌ను చేర్చిన సీబీఐ అధికారులు డెబ్భయి ఒక్క కంపెనీలు…వ్యక్తులపై నేరుగా కేసులు నమోదు చేశారు.
ఆ తరువాతి స్థానాల్లో గుర్తుతెలియని కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్లు, గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులు, గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొని ఇప్పటికే నిందితులుగా గుర్తించినవారితోపాటు మరికొందరిని సైతం విచారణ చేసేందుకు అవకాశాన్ని కల్పించుకుంది. ఇక, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి బీ.పీ.ఆచార్యను మొదటి నిందితునిగా పేర్కొంటూ ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్, సై్టలిష్ హోమ్స్‌లపై కేసులు పెట్టారు. ఆ తరువాతి స్థానాల్లో గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, గుర్తుతెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొని మరింతమందిని ప్రశ్నించే వెసులుబాటును కల్పించుకున్నారు.
మొదటి దశలో తనిఖీలకే
రెండు కేసుల్లో విచారణ మొదటి దశలో సీబీఐ అధికారులు తనిఖీలకు ప్రాధాన్యతనిచ్చారు. జగన్‌కు చెందిన సాక్షి, భారతి సిమెంట్స్‌తోపాటు ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పదుల సంఖ్యలోని కంపెనీల్లో విస్తృతస్థాయిలో తనిఖీలను నిర్వహించారు. జగన్ కంపెనీల్లో వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెట్టిన పలువురు వ్యక్తుల నివాసాల్లో కూడా సోదాలు చేశారు. ఇక, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి బీ.పీ.ఆచార్యను వ్యక్తిగతంగా విచారించటంతోపాటు ఆయన నివాసంలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్, సై్టలిష్ హోమ్స్ సంస్థల్లో కూడా సోదాలు చేసి లక్షకు పైగా డాక్యుమెంట్లు…కొన్ని కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. నీటిపారుదల, రెవెన్యూ, ఆర్థిక, ఏపీఐఐసీ, ఏపీఎండీసీ తదితర ప్రభుత్వశాఖల నుంచి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ముఖ్యమంవూతిగా ఉన్న సమయంలో జరిగిన భూ, గనులు తదితర కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను కూడా తెప్పించుకున్నారు.
వేర్వేరు బ్యాంకుల నుంచి రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న కంపెనీలు, వ్యక్తులకు సంబంధించిన ఖాతాల లావాదేవీల వివరాలను కూడా తీసుకున్నారు. బ్యాంకింగ్ రంగ నిపుణులు, ప్రయివేట్ ఆడిటర్లు, ఆదాయంపన్నుశాఖ అధికారుల సహకారంతో ఇలా సేకరించిన డాక్యుమెంట్లు, ఫైళ్ల విశ్లేషణను దాదాపుగా ముగించారు.
వ్యక్తిగత విచారణలు
ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు రెండో దశ విచారణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల యజమానులు, వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టినవారు, ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాల కేసుతో సంబంధం ఉన్నవారిని వ్యక్తిగతంగా పిలిపించుకుని విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఒకేరోజున వందకు పైగా నోటీసులను నిందితులకు జారీ చేశారు. ఈ విషయమై సీబీఐ అధికారులతో మాట్లాడగా దర్యాప్తులో ఇది కీలకమైన అంకం కాగలదని చెప్పారు. ఇప్పటికే తనిఖీల్లో పలు ఆధారాలను సేకరించగలిగామని, రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న కంపెనీల యజమానులు, వ్యక్తులను వ్యక్తిగతంగా ప్రశ్నించటం వల్ల మరిన్ని కీలకమైన వివరాలు చేతికందగలవని పేర్కొన్నారు. పకడ్బందీగా కేసును తయారు చేయటంలో…ముఖ్యంగా ఛార్జిషీట్‌ను కట్టుదిట్టంగా రూపొందించటంలో ఈ వివరాలు ప్రధాన పాత్రను పోషిస్తాయన్నారు. నిందితులను వ్యక్తిగతంగా జరిపే ఈ విచారణ ఎన్నిరోజులు కొనసాగవచ్చని అడుగగా పదిహేను రోజులు పట్టవచ్చు…నెల కూడా కావచ్చంటూ స్పందించారు.
మూడో దశలో…
ఇక, విచారణ మూడో దశలో అరెస్టులు ఉంటాయని సీబీఐ అధికారులు చెబుతున్నారు. సేకరించిన డాక్యుమెంట్లు…వ్యక్తిగతంగా జరిపే విచారణలో వెల్లడయ్యే వివరాలనుబట్టి అరెస్టులు ఉంటాయంటున్నారు. పక్కాగా సాక్ష్యాధారాలు చేతికి చిక్కినట్టయితే జగన్…ఐఏఎస్ అధికారి బీ.పీ.ఆచార్యలను సైతం అరెస్టు చేస్తామన్నారు.
Source from Namaste Telangana
Related posts:
- కరోడ్‌పతి కేబినెట్ -కమల్‌నాథ్ టాప్ (రూ.263 కోట్లు) -చివరన ఆంటోనీ (రూ.1.82 లక్షలు) -ప్రధాని ఆస్తి రూ.5 కోట్లు -చేతిలో చిల్లిగవ్వలేదన్న మొయిలీ
- జగన్, విజయమ్మ రాజీనామా ఏది ? -శంకర్ రావు
Category: City News, Latest News, Top News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.