మేమూ సిద్ధం

రాజ్యసభలో ఎంపీ కేశవరావు నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం వైఖరిని నిలదీశారు. ఆత్మాహుతికి తామూ సిద్ధమంటూ హెచ్చరించారు. ఇంకెంతమంది ప్రాణాలర్పించాలని ప్రశ్నించారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే తెలంగాణ బిల్లు కోసం ఆయన పట్టుబట్టారు. ‘తెలంగాణలో ఇంకా ఎన్ని ఆత్మహత్యలు జరగాలి? ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ ఇస్తారు? ఇప్పటి వరకు 700 మంది చనిపోయారు.. ఇంకా స్పందించందుకు? అందరూ చచ్చినంక తెలంగాణ ఇస్తరా?’ అని కేంద్రాన్ని కేకే ప్రశ్నించారు.
‘ఓ కాజ్ కోసం ఇంతమంది ప్రాణత్యాగం చేయటం చరివూతలో ఎప్పుడూ లేదు. పార్లమెంట్‌లో, అసెంబ్లీలో కనీసం ఈ సంఘటనపై సంతాపం కూడా తెలుపలేదు. ఇంకా ఎంతమంది బలికావాలో చెప్పండి? వేయి మంది ప్రాణాలు కావాలా.. మూడుకోట్ల మంది ప్రాణాలు కావాలా.. ఎంతమందివి కావాలి.. ఆత్మాహుతికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలు మనుషులు కారా? మమ్మల్ని చంపేయండి.. సమస్య పరిష్కారమవుతుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని, ఆత్మహత్యలను ఆపాలని కోరారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేయించారని, ఆ ప్రకటనను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మానసికంగా ఆంధ్రవూపదేశ్ ఎప్పుడో విడిపోయిందన్నారు. తెలంగాణపై తేల్చాలంటే రాష్ట్రంలో ప్రశాంతత కావాలంటూ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రధాని చెబితేనే సకల జనుల సమ్మెను విరమించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తెలిసి కూడా కేంద్రం స్పందించకపోవడం దారుణమని కేకే మండిపడ్డారు. తెలంగాణ ఇస్తామంటూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం కోసం అఖిలపక్ష సమావేశం కూడా జరిగిందన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని కోరారు.
తెలంగాణపై కమిటీ వేశారని, అయినా ఏమీ కాలేదని కేకే ఆవేదన వెలిబుచ్చారు. ‘తెలంగాణపై ఏం జరుగుతోంది. ప్రజల పక్షాన మేము చనిపోవడానికి సిద్ధం. ఎక్కడ లేని విధంగా పార్లమెంట్ సభ్యులు, మంత్రులు కూడా తెలంగాణ కోసం రాజీనామా చేశారు. అయినా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోంద’ని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం చేసిన ప్రకటనను అమచేయమని మాత్రమే తాము కోరుతున్నట్లు చెప్పారు.
source: namasthe Telangana
Related posts:
- మరోసారి ఆమరణ దీక్షకు కేసీఆర్ సిద్ధం
- తెలంగాణ కోసం కదం తొక్కిన మహిళలు
- తెలంగాణ సాధనే లక్ష్యంగా బీజేపీ యాత్ర
- రాజయ్య రాజీనామా
- బాన్సువాడ – ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల – అక్టోబర్ 13న పోలింగ్ – ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ
Category: National News, News


Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.