ఢీల్లీలో… జోరు తెలంగాణ!
ఢీల్లీలో… జోరు తెలంగాణ!
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె పద్దెనిమిదవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో హస్తినలో తెలంగాణం హోరెత్తింది. ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ అంశంపై మంతనాల్లో కేంద్ర నాయకత్వం నిమగ్నమైంది. ముందుగా ప్రకటించినట్లుగానే కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తెలంగాణ అంశంపై తాను ఏపీలోని మూడు ప్రాంతాల నేతలతో జరిపిన చర్చల ప్రాతిపదికగా తయారు చేసిన నివేదికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అందజేశారు. దానిపై కాంగ్రెస్ కోర్ కమిటీ దాదాపు గంటా నలభై నిమిషాల పాటు విస్తృతంగా చర్చలు జరిపింది. కోర్ కమిటీకి ఆజాద్ కూడా ఆహ్వానితునిగా హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో జరుగుతున్న సకల జనుల సమ్మె తీవ్రతను ఆయన కోర్‌కమిటీ దృష్టికి చురుకుపుట్టే స్థాయిలో తీసుకుపోయినట్లు సమాచారం. చర్చోపచర్చలు జరిపిన కోర్ కమిటీ.. దసరా తర్వాత మరోసారి సమావేశమవ్వాలని తీర్మానించింది. ఆ తర్వాత 8-10 రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చిందని సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పారు. ఇప్పుడప్పుడే అఖిలపక్ష సమావేశం ఉండబోదని తెలిపారు.పద్దెనిమిది రోజులుగా అప్రతిహతంగా సాగుతున్న సకల జనుల సమ్మెతో కేంద్రంలో కదలిక మొదలైంది.
తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీకి గట్టిగానే తాకింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణిల్లోని కార్మికులు, వృత్తి సంఘాలు సహా సబ్బండ వర్ణాలు సమ్మెలో పాల్గొనడంతో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాత్మక దిశగా ఆలోచన చేయక తప్పలేదు. ఆ క్రమంలోనే ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్మన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సభ్యులుగా ఉండే కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణ అంశంపై దృష్టి కేంద్రీకరించుకుంది. శుక్రవారం జరిగిన సమావేశాన్ని కేవలం రాష్ట్ర విభజన అంశంపై ఆజాద్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకే ఉద్దేశించారు. అయితే విభజన విషయంలో కాంగ్రెస్ వైఖరిని వెల్లడిస్తుందని భావించిన కోర్‌కమిటీ సమావేశం.. ఆద్యంతం ఉత్కంఠ రేపినా.. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవడానికి మరికొద్ది రోజులు సమయం తీసుకోవాలని భావించింది.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల కాంగ్రెస్ నేతలతో సంప్రతింపులు జరిపిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తన నివేదికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి శుక్రవారం సమర్పించారు. ఈ నివేదిక కూడా అసంపూర్తిగానే ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ నివేదికపై ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసం 7-రేస్‌కోర్స్‌లో సాయంత్రం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో గంటా నలభై నిమిషాల పాటు చర్చ జరిపారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఆజాద్ తన అభివూపాయాలు వెల్లడించగా.. హోం మంత్రి చిదంబరం కూడా తెలంగాణలో వాస్తవ పరిస్థితిని కోర్‌కమిటీ దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి నిర్ణయానికీ కోర్ కమిటీ రాలేక పోయింది. దసరా తర్వాత మరోసారి కోర్ కమిటీ భేటీలో ఈ అంశాన్ని చర్చించాలన్న నిర్ణయంతో సరిపెట్టింది. ఆ తదుపరి ఎనిమిది, పది రోజుల వ్యవధిలో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని సమావేశం అనంతరం సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌ప విలేకరులకు చెప్పారు. అప్పటిదాకా అఖిలపక్ష సమావేశం ఏమీ ఉండబోదని తెలిపారు. కోర్ కమిటీ సమావేశానికి ప్రధానితో పాటు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు ప్రణబ్‌ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, పార్టీ సీనియర్ నేత అహ్మద్‌ప హాజరయ్యారు.
ప్రత్యేక ఆహ్వానితునిగా ఆజాద్ పాల్గొన్నారు. కోర్ కమిటీ సమావేశం మొత్తం తెలంగాణ అంశంపైనే జరిగినట్లు సమాచారం. శస్త్రచికిత్స నిమిత్తం సోనియా అమెరికాకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఆమె హాజరైన తొలి కోర్‌కమిటీ సమావేశం ఇదే కావడం విశేషం. రాష్ట్ర విభజన అంశంపై మరిన్ని సంప్రతింపులు అవసరమైన దృష్ట్యా నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. సోనియాకు ఆజాద్ నివేదిక సమర్పించిన కొద్ది గంటల వ్యవధిలోనే కోర్ కమిటీ భేటీ జరిగింది. సోనియా అమెరికా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ విషయంలో ఆజాద్ ఆమెను కలవడం కూడా ఇదే మొదటి సారి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా తెలంగాణలో పక్షం రోజులకు పైగా మహోధృతంగా సాగుతున్న సకల జను ల సమ్మె ప్రభావం తీవ్రతను పార్టీ అధినేత్రి దృష్టికి ఆజాద్ తీసుకు తెలిసింది.
పార్టీ ఆదేశాల మేరకు జూలై నెలలో ఆజాద్ తన సంప్రతింపుల ప్రక్రియను ప్రారంభించారు. ఆంధ్రవూపదేశ్‌లోని మూడు ప్రాంతాల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నేతలతో చర్చలు జరిపారు. వాటి ప్రాతిపదికన ఈ నెల 30వ తేదీనాటికి తాను నివేదికను పార్టీ అధినేవూతికి సమర్పిస్తానని గతంలోనే ఆజాద్ చెప్పారు. అందుకు అనుగుణంగానే బుధవారంతో తన సంప్రతింపుల ప్రక్రియను పూర్తి చేసిన ఆజాద్.. గురువారం మొత్తం నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో నివేదికలో ఏమున్నదో అక్షరం ముక్క కూడా బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో చెప్పినట్లు ఆజాద్ తనకు తెలిపారని హోం మంత్రి చిదంబరం అంతకు ముందు తన నెలవారీ విలేకరుల సమావేశం సందర్భంగా వెల్లడించారు.
source from namasthetelangaana
Related posts:
- తెలంగాణ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్దం..
- తాడోపేడో తేల్చుకుంటాం : టీకాంగ్రెస్ నేతలు
- కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆలస్యం! ఓట్లు, సీట్లు రావేమోననే భయమే కారణం – ఎర్రబెల్లి, కొండా సురేఖ మనసుల్లో తెలంగాణ లేదు
- ఇక దిగ్బంధమే -ఇప్పట్లో కేంద్రం తెలంగాణ ఇచ్చేట్లు లేదు -సీమాంధ్ర సరిహద్దులను పూర్తిగా మూసేయాలి -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి
- తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆత్మబలిదానాల ఉసురు తగులుతుంది – అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సకల జనుల సమ్మె – అది తెలంగాణ ద్రోహులకు పెను సవాల్
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.