ఓడి బానిసలవుదామా? నిలిచి గెలుద్దామా? ఫిర్ ఏక్ ధక్కా.. ఏ ధక్కా బిగడ్‌నా నహీ
-సకల జనుల సమ్మె ఎర్రకోటను కదిలించాలి
- తెలంగాణ ఉద్యమం దేశానికి ఓ రోల్ మోడల్
- మళ్లీ రాజీనామాలే అంతిమ ఆయుధం
- ఐక్యతకు ద్రోహులు టీటీడీపీ, టీకాంక్షిగెస్‌లే
- ఆ పార్టీలపై బొడ్రాయి పంచాయితీలు జరగాలి
-డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అందరూ నక్సలై
-‘టీ న్యూస్’ ఇంటర్య్వూలో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్
‘‘ఒక్కటిగా నిలిచి గెలవడమా? ఓడిపోయి బానిసత్వాన్ని స్వీకరించడమా? ఇవ్వాళ తెలంగాణ ప్రజల ముందున్న సవాలు ఇది. తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదు’’ అని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. ‘‘ఇచ్చిన తెలంగాణను కేంద్రం అన్ని ప్రజాస్వామిక విలువలను, మర్యాదలను బలిపెట్టి ఇట్టే తన్నుకుపోయింది’’ అని ఆయన ఆరోపించారు. ‘‘సహనానికీ ఒక హద్దు ఉంటుంది. మిగిలింది సమరమే. నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటై కదలాలి. ఫిర్ ఏక్ ధక్కా, ఏ ధక్కా బిగడ్‌నా నహీ. సకల జనుల సమ్మెతో ఎర్రకోట కదలాలి. ఇంటికొకరు కదిలి ఈ సమ్మెను విజయవంతం చేయాలి. ఈ ఉద్యమం దేశానికి ఒక రోల్ మోడల్ కావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘ఉద్యమం చల్లబడిన భావన కల్పిస్తున్నదీ సీమాంధ్ర పెట్టుబడివర్గాలే. ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది ద్రోహులే’’ అని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణవ్యాప్తంగా పోరాట బొడ్రాయి పెట్టుకొని రోజూ నిరసన కార్యక్షికమాలను కొనసాగిస్తాం. గ్రామం నుంచి బస్తీ వరకు ఎక్కడికక్కడ ఉద్యమ వేదికలవుతాయి. సమ్మెలో పాల్గొనని పార్టీలు రెండే రెండు. అందులో ఒకరు చంద్రబాబు కాళ్ల దగ్గర మోకరిల్లుతూ, తెలంగాణకు ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకులు, కాగా రెండోది సోనియాగాంధీ వద్ద జీ హుజూర్ అంటూ పదవులు పట్టుకుని వేలాడుతున్న కాంగ్రెస్ నాయకులు. వీళ్లను బొడ్రాయి దగ్గర నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటున్న ఈటెలతో టీ న్యూస్ ఇంటర్వ్యూ…
కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణలో సకల జనుల సమ్మె జరగబోతున్నదని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచానికే ఆదర్శం కానుందని అన్నారు. తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదు… ఫిర్ ఏక్ దక్కా..ఏ దక్కా బిగడ్‌నా నహీ… అంటున్న ఈటెలతో టీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి….
సకల జనుల సమ్మె సన్నాహాలు ఎలా ఉన్నాయి?
ఒక్కటిగా నిలిచి గెలవడమా? ఓడిపోయి బానిసత్వాన్ని స్వీకరించడమా? ఇవ్వాళ తెలంగాణ ప్రజల ముందున్న సవాలు ఇది. తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ రాదు. కేంద్రం అన్ని ప్రజాస్వామిక విలువలను, మర్యాదలను బలిపెట్టి ఇచ్చిన తెలంగాణను ఇట్టే తన్నుకుపోయింది. సహనానికీ ఒక హద్దు ఉంటుంది. మిగిలింది సమరమే. నాలుగున్నర కోట్ల గొంతుకలు ఒక్కటై కదలాలి. ఫిర్ ఏక్ ధక్కా.. ఏ ధక్కా బిగడ్‌నా నహీ. తెలంగాణను సాధించుకుని తీరాలి. తెలంగాణవ్యాప్తంగా పోరాట బొడ్రాయి పెట్టుకొని రోజూ నిరసన కార్యక్షికమాలను కొనసాగిస్తాం. గ్రామం నుంచి బస్తీ వరకు ఎక్కడికక్కడ ఉద్యమ వేదికలవుతాయి. సకల జనుల సమ్మెతో ఎర్రకోట కదలాలి.
ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వివిధ పార్టీల మధ్య ఐక్యత కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలేంటి?
గత పదేళ్లుగా తెలంగాణ శ్రేణులను ఐక్యం చేస్తూ వచ్చింది ఒక్క టీఆస్సే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం రాష్ట్రంలోని, దేశంలోని రాజకీయ పక్షాలన్నింటింనీ ఏకోన్ముఖం చేసిన ఘనత టీఆస్‌దే. నక్సలైట్ల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ దాకా, సీసీఐ నుంచి బీజేపీ దాకా అన్ని పార్టీలు తెలంగాణ నినాదాన్ని అందుకున్నాయంటే ఎవరూ ప్రయత్నించకుండానే జరిగిందా? టీఆస్ ఎప్పుడూ ఉద్యమ శ్రేణుల మధ్య ఐక్యతనే వాంఛించింది. ‘డిసెంబర్ 9 ప్రకటన’ తర్వాత కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఆమరణ దీక్ష చేసి అప్పుడే కోలుకుంటున్న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్..తెలంగాణ జారిపోతుందన్న ఆందోళనతో ఈ సమయంలో బాధ్యతలను భుజాన వేసుకొని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానాడ్డి ఇంటికి వెళ్లి, ఆ తరువాత అన్ని పార్టీలను ఐక్యం చేసి కళింగ భవన్‌లో సభను పెట్టి, జేఏసీని ఏర్పాటు చేసి, గ్రామ స్థాయి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేశారు.
సంకుచిత రాజకీయాలు వద్దని, అమరుల త్యాగాల సాక్షిగా ఐక్యత యత్నాలు చేశాం. మొన్నటికి మొన్న 141 మంది ప్రజావూపతినిధులు రాజీనామాలు చేసినా దాన్ని మేము మా క్రెడిట్‌గా చెప్పుకోలేదు. ఐక్యత కోరుకునే వారు రాజీనామాలు తిరిస్కరించిన తర్వాత మళ్లీ రాజీనామాలు ఎందుకు చేయలేదు? మొదటిసారి పోటీలు పడి రాజీనామాలు చేసిన టీటీడీపీ నేతలు ఇప్పుడు కండిషన్‌లు ఎందుకు పెడుతున్నారు? ఏ శక్తులు అడ్డం పడ్డాయి?తెలంగాణకు ద్రోహం చేసే విషయంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్ కలిసి పనిచేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలకు ఎందుకు సోయిలేదు? తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఏం సాధించామని విధుల్లో చేరారు? ఇటువంటి వాళ్లతో ఐక్యత ఎలా సాధ్యం? ఇవ్వాళ తప్పు తెలంగాణ ప్రజలది కాదు, టీఆస్‌దీ కాదు. తప్పంతా దొంగ నాటకాలాడుతున్న టీటీడీపీ నాయకులది, టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలది.. వీళ్లను ఉద్యమ బొడ్రాయిలో నిలబెట్టి పంచాయితీ జరపాల్సిన తరుణం వచ్చింది. ఐక్యంగా లేనిది ఈ రెండు పార్టీల నేతలే. తెలంగాణ ఉద్యమ వేదికలన్నీ ఐక్యంగానే ఉన్నాయి. వందలాది జేఏసీలు ఇవ్వాళ ఉద్యమబరిలో దిగుతున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నారని, ఈ ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని బలపడుతున్నారని విమర్శిస్తున్నారు. మీరేమంటారు?
ఇది ఉద్యమాన్ని అపవాదులపాలు చేసే కుట్ర. ఎవరు నక్సలైట్లు? తెలంగాణ డాక్టర్లు, ఇంజనీర్లు, అధ్యాపకులు నక్సలైట్లా? తెలంగాణ న్యాయవాదులు నక్సలైట్లా? తెలంగాణ ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కార్మికులు నక్సలైట్లా? పారిశుధ్య కార్మికులు నక్సలైట్లా? విద్యుత్ ఇంజనీర్లు నక్సలైట్లా? ఈ కుట్రలు ఇక చెల్లవు. తెలంగాణ ఉద్యమానికి వచ్చినంత ప్రజామోదం దేశ చరివూతలో ఏ ఉద్యమానికీ రాలేదు. ఈ ఉద్యమానికి ఏదో ఒక పేరు పెట్టి కొడదామనుకుంటే తెలంగాణ ప్రజల తడాఖా ఏమిటో చూస్తారు!
కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతున్నట్లుంది కదా! అసలేం జరుగుతోంది?
కాంగ్రెస్‌లో ఒక వర్గం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల పక్షాన నిలవాలని ప్రయత్నిస్తోంది. మరో వర్గం తెలంగాణ ముసుగులో సీమాంధ్ర సంపన్న వర్గాలకు మోకరిల్లి, పదవుల కోసం పెదవులను మూసుకుంది. అమరుల త్యాగాలను మంటగలుపుతోంది.
గత కొద్ది రోజుల పరిణామాలను చూస్తే ఉద్యమం చప్పబడిపోతోందని కొంద రు తెలంగాణవాదులు భయపడుతున్నారు.. వారికి మీరే విధంగా ధైర్యాన్నిస్తారు?
ఉద్యమం ఏనాడూ చల్లబడలేదు. మండుతున్న అగ్నిగోళం. తెలంగాణ వచ్చేదాక ఉద్యమ జ్వాల రగులుతూనే ఉంటుంది. ఉద్యమం చల్లబడిన భావన కల్పిస్తున్నదీ సీమాంధ్ర పెట్టుబడివర్గాలే. ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంత మంది ద్రోహులే.
2014 వరకు తెలంగాణ వాయిదానే అంటున్నారు.. మీరేమంటారు?
తెలంగాణ ఉద్యమకారులు ఆశావాదులు. ఆత్మవిశ్వాసం కలిగిన వారు. పదకొండేళ్లు కొట్లాడినాక తెలంగాణ సాధించుకున్నారు. అయితే కేంద్రం యూటర్న్ తీసుకోవడంతో మళ్లీ ఉద్యమాలు తప్పడం లేదు. తెలంగాణ విషయంలో ఏనుగు వెళ్లి తోక చిక్కింది అన్న పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ వచ్చే దాక తెగువతో కొట్లాడుడే. తెలంగాణను సాధించుకుని తీరుతాం.
సకల జనుల సమ్మె ఎలా జరగబోతున్నది?
కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ ఉద్యమం సాగుతోంది. సకల జనుల సమ్మెలో యావత్ తెలంగాణ బిడ్డలు హాజరుకానున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరివూతలో ఏ ఉద్యమానికీ లేని కొత్తదనం ఈ దఫా తెలంగాణ ఉద్యమంతో ప్రజలు ప్రదర్శిస్తారు. ప్రజాస్వామికంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా ఉద్యమం జరుగుతుంది.
సమ్మెకు ఏ వర్గాలు, ఏ పార్టీలు మద్దతునిస్తున్నాయి?
తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి కుల, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, లాయర్స్, డాక్టర్స్, సింగరేణి, ఆర్టీసీ, ఇతర కార్మిక సంఘాలు, విద్యార్థి, యువత వంటి 137 సంఘాలు సమ్మెకు మద్దతునిస్తున్నాయి. ఉద్యమానికి, సమ్మెకు కుల, మతాలతో సంబంధం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా మంటల్లో మాడి పోయిన తెలంగాణ బిడ్డల ఆర్తనాదాల సాక్షిగా ప్రతి ఒక్కరూ పాల్గొననున్నారు. అయితే సమ్మెలో పాల్గొనని పార్టీలు రెండే రెండు. అందులో ఒకరు చంద్రబాబు కాళ్ల దగ్గర మోకరిల్లుతూ, తెలంగాణకు ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకులు. రెండోది సోనియాగాంధీ జీ హుజూర్ అంటూ సంపన్న వర్గాల ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న వారు.
సమ్మె ఎలా మొదలై ఉధృతమవుతుంది? మీ వ్యూహమేమిటి?
ప్రజాస్వామ్యంలో ప్రజాభివూపాయమే కేంద్ర బిందువు. తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉద్యమించి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా, ప్రజాభివూపాయాన్ని గౌరవించాలని ఆశిస్తున్నాం. లేదంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకుంటాం. మా వ్యూహం మాకుంది. పరిస్థితులను బట్టి దాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతాం.
గతంలో ఉద్యోగలు సమ్మె చేసినపుడు వారికి బయటి నుంచి మద్దతు రాలేదు కదా? ఈసారి ఉద్యోగులకు మద్దతుగా విద్యార్థి, యువకులు, సాధారణ ప్రజలు ఏం చేయబోతున్నారు?
గతంలో ఉద్యోగులు చేసిన సమ్మె చారివూతాత్మకమైంది. కేంద్రాన్ని ఉక్కిబిక్కిరి చేసింది. పార్లమెంట్‌లో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ‘ఆంవూధవూపదేశ్‌లో సర్కార్ పనిచేయడం లేదు. కేవలం తుపాకీ తూటాలే పని చేస్తున్నాయి. సీఎంకు జీతం కూడా రావడం లేదు’ అంటూ ప్రపంచానికి ఉద్యోగుల సమ్మె ప్రభావాన్ని చాటారు. ఈ సమ్మెకు అన్ని వర్గాలు మద్దతునిచ్చాయి. ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల, ఆర్టీసీ, సింగరేణి, ప్రైవేట్ ఉద్యోగులు సైతం సమ్మెలో పాల్గొననున్నారు. గతంలో ఉద్యోగుల సమ్మెకు ప్రజల మద్దతు రాలేదన్నది నిజం కాదు. సకల జనుల సమ్మె విజయవంతమవుతుంది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరిచ్చే కార్యక్షికమం ఏమిటి?
గ్రామం నుంచి బస్తీ వరకు ఎక్కడికక్కడ ఉద్యమ వేదికలవుతాయి. సమ్మె జరిగే అన్ని రోజుల్లో తెలంగాణ ద్రోహుల శవయావూతలు సాగుతాయి. ద్రోహులను గ్రామాల్లోకి అడుగు పెట్టనీయకుండా ప్రజలు కార్యక్షికమాలు చేస్తారు. మండల కేంద్రాల్లో ప్రతిరోజూ గ్రామ, కుల సంఘం తరఫున ఉద్యమాన్ని కొనసాగిస్తారు. జిల్లాల్లో పోరాట బొడ్రాయి పెట్టుకొని రోజూ ఆందోళనలు చేస్తారు.
జిల్లాల్లో సమ్మె ఎంత తీవ్రంగా జరిగినా హైదరాబాద్‌లో జరిగేదే లెక్క. ఇక్కడ మీరేం చేయబోతున్నారు?
హైదరాబాద్‌లో అత్యంత సీరియస్ కార్యక్షికమాలను అమలు చేయనున్నాం. ఇక్కడ ప్రభుత్వ కార్యక్షికమాలు స్తంభిస్తాయి. కంపెనీలన్నీ మూతపడతాయి. బస్తీవాసులు ఎక్కడికక్కడ కార్యక్షికమాలను కొనసాగిస్తారు. నాయీ బ్రాహ్మణులు గడ్డం తీయమంటూ, రజకులు బట్టలు ఉతకం అంటూ ప్రకటించారు. ఇలా ప్రతి చేతి వృత్తిదారులు తమ కార్యాచరణను ప్రకటించారు.
సమ్మె వాయిదాలు పడటానికి కారణాలేంటి? సమీప భవిష్యత్తులో సమ్మె జరగదనే ప్రచారం కూడా ఉంది…
తెలంగాణ ఉద్యమానికి విరమణ లేదు. కేవలం విరామం మాత్రమే ఉంటది. సమ్మె వాయిదాకు 4 ముఖ్య కారణాలున్నాయి. రంజాన్ ఉపవాసాలు ఉండటం, వినాయక చవితి రావడం, గ్రామాల్లో వ్యవసాయ పనులు ఉధృతంగా ఉండటం, సమ్మెకు సమాయత్తం కాలేకపోవడం. అయినా సమ్మె జరగదని సమైక్యవాదులు దుష్ర్పచారం చేస్తూనే ఉన్నారు.
ఎలాంటి మిలిటెంటు పోరాటానికి పిలుపునిచ్చినా అందుకోవడానికి ప్రజలిప్పుడు సిద్ధంగా ఉన్నారు.. ఈ సమయంలో సోనియాగాంధీ ఆనారోగ్యానికీ సమ్మెకీ ముడిపెట్టడం ప్రజల ఉద్యమ చైతన్యంపై నీళ్లు చల్లడం కాదా?
తెలంగాణ ప్రజానీకం ఓపిక, సహనం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్నవారు. ఎన్ని బాధలు పెట్టినా, కుట్రలు, కుతంవూతాలు పన్నినా దిగమింగి ఉద్యమాన్ని కాపాడుకుంటున్నారు. కేంద్రం దీన్ని బలహీనతగా భావించి, మాటను నిలబెట్టుకోకుంటే తెలంగాణ ప్రజలు తమ సత్తా, చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. సోనియా అనారోగ్యానికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధంలేదు.
ముందు గుజ్జార్‌లన్నారు.. తర్వాత జార్ఖండ్ అన్నారు.. ఇప్పుడు మణిపూర్ అంటున్నారు.. మీ పోరాటానికి ఎవరు స్ఫూర్తి? ఎప్పటి నుంచో మాట్లాడుతున్న ఆర్థిక దిగ్బంధం జరిగేది ఎప్పుడు?
ధర్మం, న్యాయం కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలే స్ఫూర్తి. తెలంగాణ ప్రజానీకం సమయం వచ్చినపుడు తెగువ చూపారు. అందుకు సజీవ సాక్ష్యం మహబూబాబాద్, మిలియన్ మార్చ్, ఉస్మానియా వర్సిటీ క్యాంపస్ ఘటనలే. ఇవాళ సందర్భమొస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసే ప్రయత్నం చేస్తే బరిగీసి, తెగబడి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. సందర్భం వచ్చినపుడు కీలెంచి వాత పెడతాం.
సమ్మెకు మద్దతు ప్రకటించడంలో కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదని మీరు భావిస్తున్నారా?
సమ్మె విషయంలో కాంగ్రెస్, టీడీపీలకు చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రజా చైతన్యానికి తలొగ్గి, వాళ్ల కాళ్ల కింద భూమి కదిలి పోతోందని, కాలగర్భంలో కలుస్తామని భయపడే రాజీనామాలు చేశారు. మనస్ఫూర్తిగా తెలంగాణ అనడం లేదు. 11ఏళ్లుగా కాంగ్రెస్, టీడీపీల వైఖరి చూస్తున్నాం. వారిది పచ్చి అవకాశవాదం.
వంద మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా రాని తెలంగాణ సకల జనుల సమ్మెతో వస్తుందా?
తెలంగాణ ప్రజలు ఉద్యమాలు, సమ్మెలు చేసి సత్తా చాటి 2009 డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటింప చేసుకున్నారు. సాధించుకున్న తెలంగాణను కాపాడుకోడానికి వంద మంది ప్రజావూపతినిధులు మనస్ఫూర్తిగా రాజీనామాలు చేస్తే తప్పకుండా తెలంగాణ ఏర్పడుతుంది. మోసపు రాజీనామాలు చేశారు కాబట్టి, చిత్తశుద్ధి, నిజాయితీ లేదు కాబట్టి ఈ అస్త్రం పలుచబడి పోయింది. మాట నిలుపుకోడానికి రాజీనామాలే అంతిమ ఆయుధం.
మరోసారి రాజీనామాలు చేసే విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎందుకు వెనకాడుతున్నారు?
పార్టీలపై, పదవులపై, అధిష్టానంపై ప్రేమ చూపుతున్న నాయకులకు తెలంగాణపై, ప్రజలపై ఆ ప్రేమ లేదు. అందుకే రాజీనామాల విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
Source from Namaste Telangana
No related posts.
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.