కరోడ్‌పతి కేబినెట్ -కమల్‌నాథ్ టాప్ (రూ.263 కోట్లు) -చివరన ఆంటోనీ (రూ.1.82 లక్షలు) -ప్రధాని ఆస్తి రూ.5 కోట్లు -చేతిలో చిల్లిగవ్వలేదన్న మొయిలీ
మనది పేద దేశమా? ధనిక దేశమా? అన్న చర్చను కాసేపు పక్కనపెడితే.. ధనికులు పాలిస్తున్న దేశమని మాత్రం ఘంటాపథంగా చెప్పొచ్చు! గట్టిగా చెప్పాలంటే కోటీశ్వరులే మన పాలకులని మురిసిపోవచ్చు! శనివారం నాడు ఆస్తులు ప్రకటించిన కేంద్ర కేబినెట్ మంత్రుల చిట్టా పద్దులు తిరగేస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. ఒకరిద్దరు మినహా కేంద్ర కేబినెట్‌లో అందరూ కోట్లకు పడగపూత్తినవారే! ప్రధాని మన్మోహన్ తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ.5 కోట్ల ఆస్తి ఉందని ప్రకటించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్.. అందరికంటే అగ్ర స్థానంలో ఉన్నారు. ఆయన కుటుంబం ఆస్తి మొత్తం రూ.263 కోట్లు. ఇక అత్యంత పేద మంత్రిగా కేంద్ర రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నిలిచారు. ఆయన వ్యక్తిగత ఆస్తి కేవలం రూ.1.82 లక్షలే! ఇతర మంత్రుల్లో చిదంబరం వ్యక్తిగతంగా 23 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవహారాలు చక్కబెట్టే ప్రణబ్‌ముఖర్జీకి కోటీ పాతిక లక్షల ఆస్తి ఉంది. సుశీల్ కుమార్ షిండేకు 9 కోట్లు, విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణకు కోటీ76 లక్షలు ఆస్తి ఉంది.
కేంద్ర మంత్రులు శనివారం తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు మొత్తం 72 మంది తమ ఆస్తులను వెల్లడించారు. మరో అయిదుగురు మంత్రులు మాత్రం తమ ఆస్తులను ప్రకటించలేదు. వారిలో క్యాబినెట్ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) కృష్ణ తీర్థా, జయంతి నటరాజన్, సహాయ మంత్రులు జితేందర్ సింగ్, ఎస్ జగత్క్ష్రకన్‌లు ఉన్నారు. ఈ ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయ అధికారిక వెబ్‌సైట్ http://pmindia.nic.in/rti. htmలో అందుబాటులో ఉంచారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తన మొత్తం ఆస్తుల విలువ రూ.5.11కోట్లుగా పేర్కొన్నారు. అత్యధిక ఆస్తులు ఉన్న మంత్రిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ రికార్డు సృష్టించారు. ఆయన తన మొత్తం ఆస్తుల విలువను రూ.263 కోట్లుగా వెల్లడించారు.
అయితే ఆ ఆస్తులు వివరాలను మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం. ఇక అతితక్కువ ఆస్తు లు ఉన్న మంత్రిగా రక్షణమంత్రి ఏకే అంటోనీ నమోదయ్యారు. ఆయన తనకు రూ.1.82 లక్షల ఆస్తి మాత్రమే ఉన్నట్లు తెలిపారు. తన భార్య పేర రూ.37.33 లక్షల విలువైన ఆస్తి ఉందని పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ మాత్రం తన ఆస్తులకు సంబంధించిన వివరాలను చాలా సింపుల్‌గా తేల్చేశారు. తన పేర చరాస్తులేవీ లేవన్నారు. అసలు తన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదంటూ ప్రకటించారు. బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.13.33లక్షలున్నాయని తెలిపారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం మాత్రం తన పేరుతో ఉన్న ఆస్తులతో పాటు తన భార్య ఆస్తులను కూడా ప్రకటించారు. తన ఆస్తుల్లో సైకిల్ విలువను కూడా పేర్కొటూ పెద్ద లిస్టే ఇచ్చారు. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తనకు రూ. కోటీ 25 లక్షల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. మునీర్కా, కోల్‌కతాల్లో ఇళ్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు గానీ వాటి విలువను చెప్పలేదు. టెలికాం మంత్రి కపిల్ సిబల్ బ్యాంకు డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో మొత్తం రూ.16.25 కోట్ల విలువైన ఆస్తిని ప్రకటించారు. అయితే మరో రూ.4.75 కోట్లు ఉన్నట్లు లెక్క చూపినా… వాటి వివరాలు మాత్రం పేర్కొనలేదు.
మాజీ మంత్రి దయానిధి మారన్ తనకు రూ. 2.94 కోట్లు విలువైన ఆస్తులను ప్రకటించారు. ఆ ఆస్తుల్లో ఎక్కువ భాగం రిలయన్స్‌కు చెందిన వివిధ కంపెనీల్లో పెట్టుబడులుగా ఉన్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి మురళీ దేవ్‌రా తన ఆస్తుల విలువను రూ.15.2 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో తన ఆస్తుల వివరాలు తెలపకున్నా… తన సతీమణి రెండు కంపెనీలు నడుపుతున్నారని… మరో కంపెనీలో భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ తనకు రూ.12 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. అవన్నీ కూడా డిపాజిట్లు, షేర్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ మాత్రం తనకు కోటీ 76 లక్షల ఆస్తి మాత్రమే ఉందని ప్రకటించారు. అందులో స్థిరాస్తి రూ.56 లక్షలు, భార్య పేరుతో రూ. కోటీ 10 లక్షల ఆస్తి ఉన్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మాత్రం తనకు ఢిల్లీ, షోలాపూర్, ముంబైల్లో ఇళ్లు, స్థలాలు, ఫాం హౌజ్‌లు ఉన్నట్లు తెలిపారు.
భార్య పేర రూ.4.5 కోట్ల ఆస్తిని చూపారు. ప్రవర్తనా నియామావళి ప్రకారం ఆస్తుల వివరాలను ప్రకటించాలని జూన్ 22న క్యాబినెట్ కార్యదర్శి కె.ఎం.చంద్రశేఖర్ కేంద్ర మంత్రులందరికీ లేఖలు రాశారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకే ఆయన ఆ లేఖలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 31లోగా మంత్రులు తమతమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆయన అందులో కోరారు. ఆ మేరకు మంత్రులు తమ ఆస్తులను శనివారం ప్రకటించారు.
Source from Namaste Telangana
Related posts:
- సకలజనుల సమ్మెను ఆపడం ఎవరి తరం కాదు: స్వామిగౌడ్
Category: Latest News, News, Top News
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.