హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్‌లో రాజమౌళి అనే ఆటో డ్రైవర్.. శరీరంపై పెట్రోలు పోసుకుని… నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. క్షణాల్లో మాడి మసై… విగతుడిగా మిగిలారు. వరుస ఆత్మహత్యలతో తెలంగాణ ఒక్కసారిగా అట్టుడికింది. మంగళవారం తెలంగాణ బంద్‌కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీనికి సీపీఐ, టీడీపీ తెలంగాణ ఫోరం, న్యూడెమోక్రసీతోపాటు తెలంగాణ జేఏసీ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘం 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బంది కలిగించకుండా… ఆర్టీసీ బస్సులను బంద్ నుంచి మినహాయించారు.
ఇక… ఆత్మాహుతిలో రగిలిన మంటల సెగ అటు అసెంబ్లీని, ఇటు పార్లమెంటునూ తాకింది. నినాదాలూ, నిరసనలతో చట్ట సభలు దద్దరిల్లాయి. లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలే సభా మధ్యంలోకి దూసుకెళ్లి… నినాదాలతో హోరెత్తించారు. టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి, టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు తదితరులు గొంతు కలిపారు. సాక్షాత్తూ… కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, పవన్ కుమార్ బన్సల్ కోరినా వెనక్కి తగ్గలేదు. ‘ఈ రోజే కాదు… సభ జరిగిన ప్రతి రోజూ ఇదే చేస్తాం’ అని తేల్చి చెప్పారు. చివరికి… సభ మంగళవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో సీనియర్ నేత కె.కేశవరావు రెచ్చిపోయారు. ‘అంతా ఆత్మహత్యలు చేసుకోవాలా?’ అని నిలదీశారు.
శాసనసభలో సోమవారమే ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలతోసహా… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీ-టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలతో హెరెత్తించారు. ఈ ధాటికి అసెంబ్లీ కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే మంగళవారానికి వాయిదా పడింది. స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్దన రెడ్డితో సహా పలువురు టీఆర్ఎస్ సభ్యులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా బస్సులో వరంగల్ వెళ్లారు. అక్కడ… రాజమౌళికి నివాళులు అర్పించారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణ వాదులు, వివిధ సంఘాలకు చెందిన వారు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వరంగల్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతిమ యాత్ర పొడవునా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఎంజీఎం చౌరస్తాలో రాజీవ్‌గాంధీ విగ్రహంపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది. కాశీబుగ్గలో ఇందిర గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి, పెట్రోలు పోసి తగలబెట్టారు. వైఎస్ విగ్రహాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేశారు. పోచమ్మ మైదాన్ చౌరస్తాలో మంత్రి బస్వరాజు సారయ్య ఇంటిపైకి రాళ్లతో దాడికి దిగారు.
ఆత్మహత్యలపై అధిష్ఠానం ఆరా
యువత ఆత్మహత్యలు చేసుకోవడంపై అధిష్ఠానం ఆరా తీస్తోంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ సోమవారం ఈ అంశంపై మాట్లాడారు. తెలంగాణ అంశాన్ని తర్వతిగతిన తేల్చాలని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ కోరుకుంటున్నారని బొత్స వివరించినట్లు తెలిసింది.
మరోవైపు… తెలంగాణ అంశంపై పార్టీలు సహనం ప్రదర్శించాలని కాంగ్రెస్ ఎప్పట్లాగానే హితవు పలికింది. “ఇది అత్యంత సున్నితమైన భావోద్వేగాలతో కూడిన అంశం. ఇది ఏ ఒక్క పార్టీకో సంబంధించిన అంశం కాదు. దీనితో సంబంధమున్న ప్రతి ఒక్కరూ సంయమనం ప్రదర్శించాలి” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ కోరారు.
Comments (0)
Trackback URL | Comments RSS Feed
There are no comments yet. Why not be the first to speak your mind.