కొలువుల జాతర 3 నెలల్లో 60 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు

| July 21, 2014 | 0 Comments
  • SumoMe

-టీపీఎస్సీ ద్వారా 20 వేలు
-డీఎస్సీ ద్వారా 20 వేలు 
-పోలీసు శాఖలో 15 వేల పోస్టులు
-ట్రాన్స్‌కో, జెన్‌కో, ఆర్టీసీల్లోనూభారీగా కొలువులు
-నెలరోజుల్లో టీపీఎస్సీఏర్పాటు.. 20 వేల ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్
-గ్రూప్-1, గ్రూప్-2, డీఎల్, జేఎల్, ఇంజినీరింగ్ పోస్టులు 

వలసపాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ తన ఒక్కో కలను పండించుకునే దిశగా అడుగులు వేస్తున్నది. నిరుద్యోగులు లేని తెలంగాణ సాధించుకునే ప్రక్రియలో ముందడుగు పడింది. దోపిడీకీ, పక్షపాతానికి చిహ్నమైన ఏపీపీఎస్‌సీ స్థానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) రాబోతున్నది. కేంద్రంతో ఈ దిశగా జరిపిన సంప్రదింపులు దాదాపు కొలిక్కి వచ్చాయి. అధికారుల అంచనాను బట్టి నెలరోజుల్లో కమిషన్ ఏర్పాటు కాబోతున్నది. రాష్ట్రంలో నిరుద్యోగులు టీపీఎస్సీ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కమిషన్ ఏర్పాటు లాంఛనాలు పూర్తికాగానే నిరుద్యోగులకు ఇచ్చిన హామీమేరకు భారీగా నియామకాల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల గుర్తింపు ప్రక్రియ జరుగుతున్నది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని ఖాళీల వివరాలు సేకరించి వీలయినంత త్వరలోనే నోటిఫికేషన్లు ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో దాదాపు 20 వేల పైచిలుకు ఉన్నత స్థాయి పోస్టులు భర్తీ కావాల్సి ఉంటుంది. వీటిలో కీలకమైన గ్రూప్-1 పోస్టులతోపాటు గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులున్నాయి. వీటి భర్తీకి వెనువెంటనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నది. ఇవి కాకుండా డీఎస్సీల ద్వారా 20 వేల టీచర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ ప్రక్రియ ఇప్పటికే చేపట్టాల్సిఉన్నా టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియతో ఆలస్యం జరుగుతున్నది. విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సాంకేతిక అంశాల కారణంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఒకటి రెండు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెప్పారు. ఇక పోలీస్ శాఖలో కూడా భారీగా భర్తీ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఇప్పటికే హైదరాబాద్‌లో వందల సంఖ్యలో కానిస్టేబుళ్ల భర్తీకి సీఎం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.

ఈ శాఖలో సబ్‌ఇన్‌స్పెక్టర్ల భర్తీకి కూడా కసరత్తు జరుగుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ శాఖను పటిష్ఠంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఉన్నారు. ఎక్కడా సిబ్బంది కొరత రాకుండా చూస్తామని ఇప్పటికే భరోసా ఇచ్చారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ శాఖలో దాదాపు 15 వేల పోలీస్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర నియామక సంస్థలైన టీఎస్‌ఆర్‌టీసీ, ట్రాన్స్‌కో, జెన్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగనుంది. జెన్‌కో రానున్న మూడేండ్లలో భారీ విస్తరణ చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి విద్యుదుత్పత్తిలో ప్రైవేటు భాగస్వామ్యం ఆలోచన వచ్చినా తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు పోతాయనే కారణంగా ముఖ్యమంత్రి ఇందుకు తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఉద్యోగాల భర్తీ మ్యానిఫెస్టో అంశమే..
కొత్త రాష్ట్రంలో అవసరమైన పోస్టులన్నీ భర్తీ చేయాలన్న కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలోనే ఈ అంశం ప్రముఖంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి మ్యానిఫెస్టోనే భగవద్గీత అని సీఎం ప్రకటించారు కూడా. అయితే రాష్ట్రం ఏర్పాటు కాగానే తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేకంగా లేకపోవడం, దాని ఏర్పాటు ప్రక్రియలో జాప్యంతో ఉద్యోగాల భర్తీలో ఆలస్యం అనివార్యమవుతోంది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం అన్ని ప్రభుత్వ శాఖలు రెండుగా విడిపోయాయి. కాని ఆ మేరకు పూర్తి స్థాయిలో అధికారులు లేరు. ఖాళీల సేకరణతో పాటు నోటిఫికేషన్లు ఇవ్వడం, రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి తగినంత సిబ్బంది అందుబాటులో లేరు. ఉద్యోగుల విభజన ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతూ ఉండడంతో సమస్యలు వస్తున్నాయి. సిబ్బంది కొరత వల్ల కొన్ని పనులు జాప్యం అవుతున్న మాట వాస్తవమే అని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. నిరుద్యోగుల కోసం రెండు నెలల్లోగా నోటిఫికేషన్లు జారీ చేయడానికి తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు స్పష్టం చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగస్తులకూ న్యాయం..
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ నెల 16న జరిగిన క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరమే కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్ చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై నిరుద్యోగుల్లో కొంత ఆందోళన ఏర్పడింది. కాంట్రాక్టు వారిని రెగ్యులరైజ్ చేయవద్దంటూ నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంలో నిరుద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగే అవకాశాలు లేవని విద్యావేత్తలు, సామాజిక వేత్తలు అంటున్నారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఒకరు కూడా ఇదే విషయంపై స్పష్టత ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులరైజేషన్ వల్ల నిరుద్యోగులకు వచ్చిన నష్టం ఏమీ లేదంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 40 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగస్తులు పని చేస్తున్నారు. చాలాకాలం క్రితమే ఉద్యోగాల్లో చేరినందున వీరిలో చాలామందికి ఉద్యోగాలకు అర్హత వయస్సు దాటి పోయింది. ఇపుడు నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కావడానికి వయస్సు సరిపోదు. అవకాశమిచ్చినా రెగ్యులర్ విద్యలో లేరు కాబట్టి.. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే శక్తి, తాజా విద్యార్థులతో పోటీపడే అవకాశాలు వారికి లేవు. అనేక ఏళ్లు ఉద్యోగంలో నలిగి అనుభవం సాధించిన వీరిని తొలగించి ఇంటికి పంపడం న్యాయం కాదని ప్రభుత్వం భావించింది. తర్వాత వీరు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఉద్యోగాల భర్తీకే కొత్త సమస్యలు ఎదురువుతాయని కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే వారి పోస్టులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

తెరవెనుక రాజకీయ శక్తులు..
కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులరైజేషన్ చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందంటూ ఆందోళనలు చేస్తున్న కొంతమంది నిరుద్యోగుల వెనుక కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని టీచర్ ఎంఎల్‌సీలు, అధికారులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. తమ విద్యా వ్యాపారానికి గండి పడుతుందని భావించిన కొన్ని ప్రైవేటు కోచింగ్ సంస్థలు కూడా వత్తాసు పలికి నిరుద్యోగులను రెచ్చగొడుతున్నట్లు , తెరవెనక భాగోతం నడిపిస్తున్నట్లు సమాచారం.

గత ప్రభుత్వాల నిర్వాకం..

ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టు ఉద్యోగస్తుల నియామకం వంటి విధానం తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది కాదు. 2000 సంవత్సరం నుంచి ఈ కాంట్రాక్టు విధానం అమలులోకి వచ్చింది. దీన్ని తెచ్చి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది. ప్రపంచ బ్యాంకు షరతులలో భాగంగా కాంట్రాక్టు విధానాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిచయం చేశారు. దీంతో అన్ని కీలకమైన శాఖలలో కూడా కాంట్రాక్టు విధానాన్ని అవలంభిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ శాఖలలో పదవీ విరమణలు, ప్రమోషన్లు, ఇతరత్రా కారణాల వల్ల ఏర్పడిన ఖాళీలేవీ తిరిగి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయలేదు. డీఆర్ పద్ధతి వల్ల పోస్టులు భర్తీ చేస్తే ఆర్థిక శాఖపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిధులు కరుగుతాయన్న వంకర ఆలోచనలతో ఈ విధానాన్ని అమలు చేశారు.

Tags: ,

Category: Careers, IT Jobs, Opening Govt Jobs in Telangana State, Other Jobs

Comments (0)

Trackback URL | Comments RSS Feed

There are no comments yet. Why not be the first to speak your mind.

Leave a Reply

Time limit is exhausted. Please reload CAPTCHA.Web Design Company warangal, Web Designing warangal, Logo Design Company Warangal, Indian Website Design Company, maddysoft.co.in
car rental services warangal, kazipet, hanamkonda
Content Protected Using Blog Protector By: PcDrome.